: రూ. 2,380 కోట్లతో రూ. 23,380 వ్యాపారాన్ని కొన్న డాక్టర్ రెడ్డీస్
యూఎస్ లోని ప్రముఖ ఔషధరంగ కంపెనీలుగా ఉన్న తెవా, అలెర్గాన్ సంస్థలకు చెందిన 8 ఔషధాలపై పూర్తి హక్కులను డాక్టర్ రెడ్డీస్ సొంతం చేసుకుంది. 350 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,380 కోట్లు) వెచ్చించి ఈ ఔషధ హక్కులను రెడ్డీస్ సొంతం చేసుకోగా, ఈ బ్రాండ్లు, మార్కెట్లో 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,380 కోట్లు) వ్యాపారాన్ని ఇప్పటికే నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ తో అమెరికాలో తమ వ్యాపారం మరింతగా విస్తరించనుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి నగదు మార్పిడి ద్వారా ఈ లావాదేవీలు జరిగాయని డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ జీవీ ప్రసాద్ వెల్లడించారు. డీల్ కు సరిపడినన్ని నిధులు ఉన్నాయని తెలిపారు. కాగా, గత జూలైలో జెరూసలేం కేంద్రంగా నడుస్తున్న తెవా సంస్థ అలెర్గాన్ ను 40.5 బిలియన్ డాలర్లతో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.