: బీహార్ లో ఇంటర్ టాపర్ల స్కాం... మాస్టర్ మైండ్ అరెస్ట్
బీహార్ లో వెలుగుచూసిన ఇంటర్ టాపర్ల స్కాం వెనకున్న ప్రధాన సూత్రధారి అమిత్ కుమార్ అలియాస్ బచ్చా రాయ్ ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వైశాలీ జిల్లాలో వీఆర్ కాలేజీలో ప్రిన్సిపాల్, డైరెక్టరుగా పనిచేస్తూ, విద్యార్థులతో కాపీలు కొట్టించాడని పోలీసులు తెలిపారు. ఘటన వెలుగుచూసిన నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న రాయ్, స్వయంగా పోలీసులకు లొంగిపోయాడని, ఆయన్ను అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచామని వివరించారు. ఈ కేసులో ఇంతవరకూ ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కాగా, రాయ్ కి సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు మాజీ చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలిస్తున్నామని వివరించారు.