: సరిహద్దులో ముగ్గురు మైనర్లకు చాక్లెట్లిచ్చి పాక్ కు పాఠం నేర్పిన బీఎస్ఎఫ్!
ఇండియా పట్ల పాకిస్థాన్ వైఖరి ఎలా ఉన్నా, ఆ దేశాన్ని శత్రుదేశంగా తాము భావించడం లేదని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరోసారి నిరూపించింది. పొరపాటున పాక్ నుంచి తప్పిపోయి భారత భూభాగానికి వచ్చి దొరికిపోయిన ముగ్గురు మైనర్ బాలురకు చాక్లెట్లు, ఇతర కానుకలు ఇచ్చి తిరిగి వారి దేశానికి పంపి, పాక్ కు ఓ సరికొత్త పాఠం చెప్పారు మన జవాన్లు. ఈ ఘటన అమృతసర్ జిల్లా అజ్నాల పట్టణ సమీపంలో జరిగింది. తమ బంధువుల ఇంటికి బయలుదేరిన అమీర్ (15), నోమిన్ అలీ (14), అర్షద్ (12)లు దారితప్పి నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇండియా పరిధిలోకి వచ్చారు. "ఈ ముగ్గురు బాలలు పొరపాటున ఇండియాలోకి వచ్చారు. మా జవాన్లు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఈ ప్రాంతం ఇండియాదని తెలియదు" అని 70 బీఎస్ఎఫ్ బెటాలియన్ కమాండర్ సీపీ మీనా వెల్లడించారు. వీరి చొరబాటును గురించి పాక్ అధికారులకు వెంటనే తెలిపామని, వీరిని క్షేమంగా పంపిస్తామని కూడా చెప్పామని అన్నారు. "వీరు పిల్లలు. వారిలో దురుద్దేశాలు లేవు. అందుకే మేము రంజాన్ బహుమతులను వారికి ఇచ్చాం. వారు రోజంతా ఏమీ తినలేదు కూడా. ఇండియా నుంచి వారు మధురానుభూతులను వెంట తీసుకువెళ్లాలన్నది మా ఉద్దేశం" అని మీనా తెలిపారు. తమను జవాన్లు బాగా చూసుకున్నారని తొమ్మిదో తరగతి చదువుతున్న అమీర్ వెల్లడించాడు. ఎవరైనా ఇండియా నుంచి తప్పిపోయి పాక్ వైపు వస్తే, తమ ప్రభుత్వం కూడా ఇలాగే చూసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.