: నాకు బాగా తెలుసు, గోదావరి ప్రజలు నేరాలు చేయరు... కాపు విధ్వంసం వైకాపా రౌడీలపనే: బాబు
"ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల ప్రజలు ఇలాంటి నేరాలు చేయరు. నాకు బాగా తెలుసు. నన్ను అభిమానించే ప్రజలు వాళ్లు. గతంలో హరికేన్ తుపాను వచ్చినప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంతవరకూ 15 రోజుల పాటు అక్కడే ఉన్నాను. ఆ జిల్లాల్లో దొంగతనాలు తక్కువ. ప్రజలు మంచివాళ్లు. ఏం చేసినా మంచిగా చేస్తారు. అందుకే వాళ్లెవరూ వైకాపాకు ఓట్లు వేయలేదు. వాళ్ల అమ్మ కూడా గెలవలేదు. ఇప్పుడేం జరిగిందో చూడండి. బయటి నుంచి మనుషులను పంపించి, కాపు ఉద్యమం పేరుతో ట్రైన్ తగులబెట్టారు. ట్రైన్ ఏం తప్పు చేసిందని నేను అడుగుతున్నాను. ఆ ట్రైన్ ను తగులబెట్టడం వల్ల రాష్ట్రంలో ఎంతో అభద్రతాభావం ఏర్పడింది. ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రైలును వదిలి పరుగు పెట్టారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దోషులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తులు విచ్చలవిడిగా వస్తుంటే, ఎవరు ఆన్సర్ చేస్తారు?" అని చంద్రబాబు వైకాపాపై విరుచుకుపడ్డారు. రైలు దహనం, ఆపై జరిగిన విధ్వంసం వెనకున్నది కచ్చితంగా వైకాపా రౌడీలేనని అన్నారు. కాపులకు అన్నీ ఇస్తానని తాను హామీ ఇస్తుంటే, ఇంక ఉద్యమాలు ఎందుకని ప్రశ్నించారు.