: పారదర్శకత కోసం... హాంగ్ కాంగ్ లో అద్దాల ఆఫీసు!
బహుళ అంతస్తుల అద్దాల భవంతులను చూసి, 'అబ్బా అద్దాల మేడ' అద్భుతంగా ఉందని ఆశ్చర్యపోతుంటాం. నిజానికి ఈ బహుళ అంతస్తుల భవనాలకు ముందు భాగంలో మాత్రమే అద్దాలు అమరుస్తారు. దీంతో అవి అద్దాల మేడలుగా ప్రసిద్ధి చెందుతున్నాయి. వీటన్నింటికీ భిన్నంగా హాంగ్ కాంగ్ లో నెదర్లాండ్ కి చెందిన ఎంవీఆర్ డీవీ అనే భవన నిర్మాణ సంస్థ అత్యాధునిక భవనాన్ని నిర్మించింది. 1 లక్షా 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్క ఇటుక కూడా వాడకుండా ఆ భవంతిని నిర్మించడం విశేషం. వ్యక్తిగత అవసరాల గదులు (టాయిలెట్లు) మినహా మిగిలిన ప్రాంతాలన్నీ అద్దాలతోనే నిర్మించారు. గోడలు, తలుపులు, డెస్కులు, కుర్చీలు, స్లాబ్, గదులు, ఫ్లోర్ ఇలా అన్నీ అద్దాలతో నిర్మించారు. ఈ బిల్డింగ్ లో ఏ మూల నుంచి చూసినా మరో మూల కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో పారదర్శకత చాలా అవసరమని, తమ ఆఫీసును కూడా పారదర్శకంగా నిర్వహిస్తామని సింబాలిక్ గా చాటి చెప్పేందుకు ఈ అద్దాల భవనం నిర్మించామని వారు తెలిపారు.