: చిరంజీవి ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా..?: మంత్రి నారాయణ ఆగ్రహం
కాపుల రిజర్వేషన్ల ఉద్యమం, ముద్రగడ పద్మనాభం దీక్ష, అరెస్టు నేపథ్యంలో తమ ప్రభుత్వంపై వస్తోన్న విమర్శల పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరోసారి స్పందించారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తుని ఘటనపై సీబీఐతోనే విచారణ జరిపించాలంటూ, ముద్రగడ అరెస్టు అమానుషమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తునిలో ఆందోళనకారులు రైలుని తగలబెట్టి విధ్వంసం సృష్టించారని, అలాంటి వారిని శిక్షించవద్దా..? అని ఆయన ప్రశ్నించారు. కాపుల సంక్షేమం అంటూ ప్రజారాజ్యం పార్టీని పెట్టారని, ఆ తరువాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారని నారాయణ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి కాపులను బీసీలలో చేర్చడానికి ప్రయత్నాలు చేశారా..? అని ఆయన దుయ్యబట్టారు.