: పవన్ కల్యాణ్ ఎక్కడ వున్నారు? ఏం చేస్తున్నారు?: సీపీఐ నారాయణ
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ గిమ్మిక్కులు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో ఓ సారి మీడియా ముందుకు వచ్చి పవన్ నీతులు చెబుతున్నారని, అవి వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాపునేత ముద్రగడ పద్మనాభం దీక్ష, అరెస్టు లాంటి అంశాలు చెలరేగుతోంటే పవన్ ఏం చేస్తున్నారని, ఆయన ఎక్కడ ఉన్నారని నారాయణ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ని రాజకీయాల్లో ఓ జోకర్‌గా ఆయన అభివర్ణించారు. కాపులకు అండగా ఉంటానని చెప్పిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్రొ.కోదండరాంపై చేసిన వ్యాఖ్యల పట్ల కూడా నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం తమ పాలనపై ఎందుకు విమర్శలు చేయవలసి వచ్చిందో గుర్తించి పాలనను చక్కదిద్దుకోవాల్సిందిపోయి టీఆర్ఎస్ నాయకులు ఆయనపై ప్రతివిమర్శలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు వివేకంగా ఆలోచించి తమ తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం ప్రముఖ పాత్ర వహించారని, అప్పుడు ఆయనను వాడుకొని ఇప్పుడు విమర్శలు గుప్పించడం భావ్యం కాదని ఆయన సూచించారు.