: చదవడం లేదని విద్యార్థుల కాళ్లపై కర్పూరం పెట్టి కాల్చిన టీచర్.. అరెస్ట్
బుద్ధిగా చదువుకోవడం లేదంటూ 8, 9 ఏళ్ల వయసుండే విద్యార్థుల కాళ్లపై ఓ ఉపాధ్యాయురాలు కర్పూరం పెట్టి కాల్చిన ఘటన తమిళనాడు విల్లుపురం జిల్లాలోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది. వైజయంతి మాల అనే ఉపాధ్యాయురాలు ఈ దారుణానికి పాల్పడింది. సరిగ్గా చదవాలని హెచ్చరిస్తున్నా వినడం లేదంటూ నాలుగో తరగతి చదువుతోన్న 15 మంది పిల్లలపై ఉపాధ్యాయురాలు ఈ చర్యకు పాల్పడింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ స్పందించి వైజయంతి మాలను, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. చిన్నారులను కర్పూరంతో కాల్చిన ఉపాధ్యాయురాలిపై జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఆమెను అరెస్ట్ చేశారు. ఉపాధ్యాయురాలికి ఈనెల 24వ తేదీ వరకు స్థానిక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.