: 'ఎన్టీఆర్' అనే మూడక్షరాలు వింటే నా రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది: అమెరికాలో బాలకృష్ణ
అమెరికాలో తెలుగు సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన 56వ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కాలిఫోర్నియాలో బాలకృష్ణ అభిమానులు ఈరోజు ఏర్పాటు చేసిన ఈవెంట్‌కి హాజరైన బాలకృష్ణ తన పుట్టిన రోజు కేక్‌ని కట్ చేశారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకకి పెద్దఎత్తున నందమూరి అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మనిషి తాను పుట్టిన గ్రామానికి, జాతికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ‘ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది, తెలుగు పేరు వినిపించినా నా తనువు పులకించిపోతుంది’ అని ఆయన అన్నారు. ‘ప్రతికూల పరిస్థితులకి తలవంచక ముందుకు సాగిన నేత, తెలుగు వెలుగు ఎన్టీఆర్’ అని బాలకృష్ణ అన్నారు. ఆయనకు కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని బాలయ్య అన్నారు. తనకు తన తండ్రి కోట్లాది అభిమానులని వారసత్వంగా ఇచ్చి వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ‘తెలుగు జాతి గౌరవం నిలబెట్టిన మహానేత ఎన్టీఆర్’ అని ఆయన అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించారని ఎన్టీఆర్ సేవల్ని బాలయ్య గుర్తు చేశారు.