: ఖడ్సేకు క్లీన్ చిట్... మరాఠా నేతకు వచ్చిన ఫోన్ కాల్స్ దావూద్ ఇబ్రహీం ఇంటివి కాదట
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు, సర్కారీ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ముడుపులు... తదితర ఆరోపణలతో మహారాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలగిన ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సేకు క్లీన్ చిట్ లభించేసిందట. పాకిస్థాన్ నగరం కరాచీలోని దావూద్ ఇబ్రహీం ఇంటిలోని ఓ ల్యాండ్ లైన్ నుంచి ఖడ్సేకు పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయన్న ఆరోపణలు బీజేపీలో గుబులు రేపాయి. ఈ ఆరోపణలు సద్దుమణగకముందే... మంత్రి హోదాలో ఖడ్సే పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తొలుత కేబినెట్ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్న ఖడ్సే... ఆ తర్వాత అధిష్ఠానం ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఖడ్సేపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తు దాదాపుగా ముగిసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఖడ్సేకు పాక్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఫోన్ కాల్స్ దావూద్ ఇబ్రహీం ఇంటి నుంచి వచ్చినవి కావట. అంతేకాకుండా దావూద్ ఇంటి నుంచి ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని చెబుతున్న నెంబరును అసలు ఆయన ఏడాదిగా వాడటమే లేదట. ఈ నేపథ్యంలో దావూద్ తో లింకుల విషయంలో ఖడ్సేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ ఆరోపణలు అవాస్తవమని పోలీసులు నిర్ధారిస్తే ఖడ్సేకు పెద్ద రిలీఫ్ దొరికినట్లే.