: తప్పుకు మూల్యం చెల్లించండి... బీఓబీకి లీగల్ నోటీసు జారీ చేసిన మాల్యా ‘గ్యారెంటర్’
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ కు చెందిన మన్మోహన్ సింగ్... ఓ సాధారణ రైతు. పొలం నమ్ముకుని జీవనం సాగించే ఆయనకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎవరో తెలియదు. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు మాత్రం ఆయనకు మాల్యా తెలుసన్నారు. అంతేనా... మాల్యా తమ వద్ద తీసుకున్న రూ.550 కోట్లకు మన్మోహన్ సింగ్ గ్యారెంటీ కూడా ఇచ్చారని తేల్చారు. అంతే ముందూ వెనుకా చూడకుండా ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఆయన బ్యాంకు ఖాతాలను, పంట రుణం ఖాతాను స్తంభింపజేయాలని నంద్ బ్రాంచ్ కు ఆదేశాలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ షాక్ తిన్నారు. ఆ షాక్ నుంచి తేరుకున్న సింగ్... తనను ఇబ్బందుల పాలు చేసిన బ్యాంకర్లపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏ పాపం ఎరుగని తనను ఇబ్బంది పెట్టిన బ్యాంకర్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన తప్పేమీ లేకున్నా... అనవసరంగా ఇబ్బంది పెట్టిన కారణంగా తనకు పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలని ఆయన ఆ నోటీసుల్లో కోరారు. ఈ మేరకు ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతీయ కార్యాలయంతో పాటు నంద్ బ్రాంచ్ కు ఆయన ఈ నోటీసులను తన న్యాయవాది ద్వారా పంపారు.