: ఐఎస్ కు మరో దెబ్బ... వైమానిక దాడుల్లో బాగ్దాదీకి గాయాలు
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆ సంస్థకు నిన్న భారీ దెబ్బ తగిలింది. ఇరాక్- సిరియా సరిహద్దులో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన సంకీర్ణ సేనలు చేసిన వైమానిక దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. ఐఎస్ ముఖ్యులతో కలిసి అతడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై సంకీర్ణ సేనలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో బాగ్దాదీతో పాటు అతడితో కలిసి ప్రయాణిస్తున్న ఐఎస్ ముఖ్యులు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ మేరకు అక్కడి స్థానికులతో ఈ విషయాన్ని ధ్రువీకరించగా, ఇరాకీ న్యూస్ ఛానెల్ ‘ఆల్ సుమరియా’ కూడా ఈ వార్తలు నిజమేనని తెలిపింది.