: స్వామి చక్రపాణినీ టార్గెట్ చేసిన చోటా షకీల్... దావూద్ కారును బుగ్గి చేయడమే కారణమట
తీహార్ జైల్లోని మాఫియా డాన్ చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకీల్ పన్నిన కుట్రలో మరో ఆసక్తికర కోణం వెలుగుచూసింది. జైలు నుంచి కోర్టుకు తరలించే సమయంలో చోటా రాజన్ ను కాల్చేయమంటూ చోటా షకీల్ రంగంలోకి దించిన నలుగురు కాంట్రాక్టు కిల్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కేవలం రూ.5 లక్షలు తీసుకున్న ఈ నలుగురు కిల్లర్లు... చోటా రాజన్ ను హత్య చేసేందుకు ఢిల్లీలోకి ఎంటరయ్యారు. వీరి లక్ష్యం ఒక్క చోటా రాజన్ మాత్రమే కాదట. గతంలో దావూద్ ఇబ్రహీం కారును వేలంలో కొనుగోలు చేసి దానిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి వార్తల్లోకి ఎక్కిన హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణిని కూడా చంపేయాలని చోటా షకీల్ ఆ కిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాడట. అయితే ఢిల్లీ శివారులోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో మకాం వేసిన ఈ నలుగురు కిల్లర్లు.. ఫోన్ సంభాషణలతో పోలీసులకు చిక్కిపోయారు.