: వియన్నాలో కుదరలేదు... ‘సీయోల్’ దాకా ఆగాల్సిందే: భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై హైడ్రామా
అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో భారత్ కు ఇక సభ్యత్వం ఖాయమేనన్న వాదన వినిపించింది. అయితే నిన్న వియన్నాలో ముగిసిన ఎన్ఎస్జీ సభ్య దేశాలు ఆ దిశగా తుది నిర్ణయం తీసుకోలేకపోయాయి. భారత్ కు కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై చర్చే ప్రధానంగా జరిగిన ఈ భేటీలో భారత్ కు అనుకూలంగా నిర్ణయం రాలేదు. అయితే సభ్యత్వం కోసం దరఖాస్తుకు ఆ కూటమి ‘నో’ అని కూడా చెప్పలేదు. కూటమిలో భారత్ ఎంట్రీకి ఆది నుంచి వ్యతిరేకంగానే ఉన్న చైనా నిన్నటి భేటీలోనూ తన నిరసన గళం విప్పింది. ఎన్పీటీ (నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ)పై సంతకం పెట్టని భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా వాదించింది. చైనా వాదనకు దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్, టర్కీ... తదితర దేశాలు మద్దతు పలికాయి. దీంతో అమెరికా సహా మెజారిటీ దేశాలు సంపూర్ణ మద్దతు పలికినా.. నిన్నటి భేటీలో ఎన్ఎస్జీ సభ్యత్వం దక్కలేదు. దీనిపై మరోమారు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆ భేటీ తీర్మానించింది. ఈ నెల 20న దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో జరిగే తదుపరి భేటీలో భారత సభ్యత్వంపై నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. దీంతో ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం భారత్ ఈ నెల 20 దాకా వేచి చూడాల్సిందే.