: నలుగురు కొడుకులున్నా అనాధ శవమైన తల్లి!
మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో విలువలు లేని కొడుకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని నిరూపించే ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వేములపల్లి మండలం రావులపెంటకు చెందిన సోమ మట్టమ్మ (80)కు నలుగురు కుమారులు. వారిలో ఇద్దరు సూర్యాపేటలో, ఒకడు తిప్పర్తిలో, మరొకడు రావులపెంటలో స్థిరపడ్డారు. పేరుకి నలుగురు కుమారులున్నా తల్లిని చేరదీసేవారు లేకపోవడంతో, గ్రామంలో దొరికిన పనిచేసుకుంటూ వచ్చే డబ్బులు, వృద్ధాప్య పింఛనుతో ఆమె నెట్టుకొచ్చింది. వయసు మళ్లిన మట్టమ్మ, నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో ఉంటున్న తన చెల్లి అచ్చమ్మ దగ్గరకు వెళ్లింది. ఆ క్రమంలో గత రాత్రి ఆమె అక్కడే తనువు చాలించింది. దీంతో బంధువులు మట్టమ్మ కుమారులకు విషయం వివరించి, ఎవరి దగ్గరకు ఆమె మృతదేహాన్ని తీసుకురావాలని అడిగారు. నలుగురూ తమ దగ్గరకు వద్దంటే తమదగ్గరకు వద్దని నిష్కర్షగా చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వారు ముందుకు రాలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని రావులపెంటలో ఆమెకు ఏ చర్చి అయితే ఆశ్రయమిచ్చిందో అదే చర్చికి తీసుకొచ్చారు. దీంతో చర్చి నిర్వాహకులు ఆమె అంతిమసంస్కారం స్థానికులు, బంధువుల సాయంతో క్రైస్తవ మతాచారం ప్రకారం నిర్వహించారు.