: నేను జరగాలని కోరుకున్నవన్నీ జరిగాయి: ఎర్రవల్లిలో కేసీఆర్
‘నా జాతకంలో ఒకటుంది.. నేను ఏది జరగాలనుకుంటే అవన్నీ జరిగాయి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో ఆయన దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఇంతవరకు ఏది జరగాలని కోరుకున్నానో అవన్నీ నెరవేరాయని, ఇప్పుడు ఎర్రవల్లి గ్రామం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నానని ఈ కల కూడా నెరవేరితీరుతుందని అన్నారు. ఎర్రవల్లి గ్రామమంతా అభివృద్ధి చెంది వికసించిన ఒక పువ్వులా కనపడాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఐకమత్యంగా పనిచెయ్యాలని సూచించారు. ‘ప్రజల సంఘటిత శక్తిలో చాలా బలం ఉంది, అది కొండల్ని కూడా బద్దలు కొట్టగలుగుతుంది’ అని కేసీఆర్ అన్నారు. అందరూ కలసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఊరిలో ఉన్న ప్రతీ మనిషికీ ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకే పంటలు వేయాలని చెప్పారు. ఎర్రవల్లి రూపు రేఖలు ఇక మారిపోతాయని, దానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎర్రవల్లిలో పలు అభివృద్ధి పనులపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటి చుట్టూ తప్పని సరిగా మొక్కలు పెంచాలని సూచించారు.