: మాంసాహారులు తెలంగాణలోనే అధికం.. 99% మంది మాంసాహారులతో దేశంలోనే తొలిస్థానం
తెలంగాణ వాసులు మాంసాహారాన్ని ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇంట్లో తాము చేసుకునే అన్ని వేడుకల్లోను వారికి మాంసాహారం ఉండాల్సిందే. అందుకే, నాన్ వెజ్ ప్రియులుగా తెలంగాణ వాసులు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు వెనక్కి నెట్టేశారు. ఈ అంశాన్ని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) పేర్కొంది. తెలంగాణలో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం 99గా ఉందని ఎస్ఆర్ఎస్ తెలిపింది. ఈ రాష్ట్రంలో 99 శాతం మంది మాంసాహారాన్ని భుజిస్తారని, దేశంలో మాంసాహారాన్ని తీసుకునే వారి సంఖ్యలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని 2014లో నిర్వహించిన సర్వే ద్వారా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధారంగా ఎస్ఆర్ఎస్ తెలిపింది. మాంసాహారం భుజిస్తున్న వారిలో తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ ఉందని, ఆ రాష్ట్రంలో 98.55 శాతం మంది మాంసాహారం తీసుకుంటారని ఎస్ఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ, బెంగాల్ తరువాత ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో వరసగా 97.35, 97 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని తీసుకుంటూ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. గుజరాత్లో గతంలో కన్నా మాంసాన్ని తినే వారి సంఖ్య 40 శాతం పెరిగిందని తెలిపింది. గుజరాత్లో పురుషులు మాంసాహారాన్ని ఎంతగా తింటున్నారో అదే సంఖ్యలో స్త్రీలు కూడా తీసుకుంటున్నారని పేర్కొంది.