: ఇక లోక్ సభతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు... కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు
పార్లమెంటులోని దిగువ సభ లోక్ సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఐదేళ్లకోమారు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో ఏటా ఎన్నికలే. పార్లమెంటుకు ఓ సారి ఎన్నికలు జరిగితే... ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు విడతలవారీగా వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక లోక్ సభతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఖాళీ అవుతున్న స్థానాల భర్తీకి ఉప ఎన్నికలు సరేసరి. వెరసి ఖర్చు తడిసిమోపెడతోంది. ఈ క్రమంలో లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి పెద్ద ఖర్చు తగ్గుతుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీలు చిక్కుతుంది. ఇక ఐదేళ్ల పాటు ఎన్నికలతో సంబంధం లేకుండానే పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అవకాశం చిక్కుతుంది. వెరసి ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఇదే దిశగా యోచించిన నరేంద్ర మోదీ సర్కారు... ఈ ప్రతిపాదన దిశగా సరికొత్త అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసింది. వచ్చే నెలాఖరులోగా ఈ కమిటి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ఈ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న కేంద్రం... అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకుని ముందడుగు వేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ యోచన మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఒకే దఫా ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలను కేవలం రూ.9 వేల కోట్లతోనే పూర్తి చేసే వీలున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐదేళ్ల పాటు ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఖర్చు తడిసిమోపెడుతోంది.