: ప్రభుత్వం తనకు నచ్చని ఛానళ్లను కట్ చేసే విధానాన్ని ఆపేయాలి: జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే కాపుల ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసం కేసును సీబీఐకి అప్పజెప్పాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాపులది ఓ సామాజిక సమస్య అని ఆయన అన్నారు. సీబీఐ ఢిల్లీ నుంచి వచ్చి కేసును పరిశీలిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘పోలీసు వ్యవస్థని మీ చేతుల్లో పెట్టుకొని మీకు నచ్చని వారిపై కేసులు పెడుతున్నార’ని ఆయన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ చేస్తేనే అసలు నిజం బయట పడుతుందని ఆయన అన్నారు. కాపుల ఆందోళన అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించే పనిలో ఉందని జగన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం తమకు నచ్చని మీడియా ఛానళ్లను ఆపించేసే కార్యక్రమం చేస్తోందని జగన్ ఆరోపించారు. మీడియా గొంతునొక్కేస్తూ చంద్రబాబు తమ పనిని కానిచ్చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం తమకు నచ్చని ఛానళ్లను కట్ చేసే విధానాన్ని ఆపేయాలని జగన్ డిమాండ్ చేశారు.