: యూపీ ఎన్నికల్లో మోదీ నామస్మరణకు బీజేపీ రాంరాం


గడచిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నామస్మరణ చేసిన బీజేపీ అధికారాన్ని ఈజీగానే చేజిక్కించుకుంది. ఆ తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ మోదీ మంత్రాన్నే పఠించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చినా... మెజారిటీ రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా దేశ రాజకీయాల ముఖ చిత్రాన్నే మార్చగలిలే సత్తా ఉన్న కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన వ్యూహాన్ని మార్చేసింది. మోదీ మంత్రానికి బదులుగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నామస్మరణ చేయాలని తీర్మానించింది. ఇటీవల ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి జరిగిన పలు సర్వేల్లో గాంధీ కుటుంబ వారసుడు, కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ముందున్నారు. వరుణ్ తర్వాతి స్థానంలో మాత్రం రాజ్ నాథ్ ఉన్నారు. ఇప్పటిదాకా బీజేపీ సీఎం అభ్యర్థిపై పార్టీ నిర్ణయం తీసుకోనప్పటికీ... మోదీ పేరుకు బదులుగా రాజ్ నాథ్ సింగ్ ను ముందు పెట్టుకునే ఎన్నికల బరిలోకి దిగాలని ఆ పార్టీ దాదాపుగా నిర్ణయించింది. ఈ రాష్ట్రం నుంచి నేడు జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తనదైన శైలిలో చక్రం తిప్పిన రాజ్ నాథ్... ఏకంగా 11 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టి వారి విజయానికి వ్యూహాలు పన్నారు. ఆ రాష్ట్రానికి గతంలో సీఎంగా వ్యవహరించిన అనుభవం కూడా ఉన్న రాజ్ నాథ్ సింగ్ నే ప్రధాన ఆయుధంగా ఎన్నికలకు దిగేందుకు కమల దళం తీర్మానించింది.

  • Loading...

More Telugu News