: దర్శకేంద్రుడిపై ‘అనంత’ యువకుడి దాడి!... ఇంటి ఆవరణలో విధ్వంసం సృష్టించిన వైనం!
టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావుపై నిన్న ఉదయం ఓ యువకుడు దాడికి దిగాడు. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ సైట్-2లో నివసిస్తున్న రాఘవేంద్రరావు నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళుతున్న క్రమంలో జరిగిన ఈ దాడిలో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడకు చెందిన వల్లిపి రవీంద్ర అనే యువకుడు నానా బీభత్సం సృష్టించాడు. 2006లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’ చిత్ర మూల కథ తనదేనని చెప్పుకున్న సదరు యువకుడు... ఇప్పటిదాకా దానికి సంబంధించి రెమ్యూనరేషన్ తనకు అందలేదని వీరంగమాడాడు. అంతేకాక కథ తనదైతే... టైటిల్స్ లో కథా రచయితగా భారవి పేరు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాఘవేంద్రరావు కారును నిలిపేసిన అతడు ఆయనపై తిట్ల దండకం కూడా అందుకున్నాడు. తనను అడ్డుకునేందుకు యత్నించిన వాచ్ మన్ ను పక్కకు తోసేసిన రవీంద్ర... రాఘవేంద్రరావును కారు నుంచి బయటకు లాగేందుకు యత్నించాడు. అయితే ఎలాగోలా రవీంద్ర దాడి నుంచి తప్పించుకుంటూ రాఘవేంద్రరావు కారు బయటకు వెళ్లిపోయింది. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన రవీంద్ర ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ ఇనుప రాడ్ ను తీసుకుని రాఘవేంద్రరావు ఇంటిలోకి ప్రవేశించాడు. అడ్డుకున్న వాచ్ మన్ పై దాడి చేసి లోపలికి ప్రవేశించిన రవీంద్ర... అక్కడ ఉన్న ఆడి, బెంజి, శాంట్రో కార్లపై విరుచుకుపడ్డాడు. ఇతని దాడిలో ఆ కార్లన్నీ ధ్వంసమయ్యాయి. ఆ శబ్దం విని బయటకు వచ్చిన రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ రావుపైనా అతడు దాడికి యత్నించాడు. ఈ క్రమంలో వాచ్ మన్ సహకారంతో రవీంద్రను పట్టుకున్న ప్రకాశ్ రావు అతడిని సెక్యూరిటీ గదిలో బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా బుధవారమే రాఘవేంద్రరావు ఇంటి పరిసరాల్లోకి వచ్చిన రవీంద్ర అక్కడ రెక్కీ నిర్వహించాడని తెలిసింది. అంతేకాక బుధవారమే దాడికి యత్నించగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిన్న అతడు దాడికి దిగాడట.