: ముద్రగడ ఎఫెక్ట్... ఉభయగోదావరి జిల్లాల బంద్ కు పిలుపు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల బంద్ కు ఆల్ ఇండియా కాపు జేఏసీ పిలుపు నిచ్చింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న కాపు కార్యాలయంలో నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బేషరతుగా ముద్రగడను విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాపు జేఏసీ డిమాండ్ చేసింది. ముద్రగడను విడుదల చేయకపోతే కనుక రేపు తూర్పుగోదావరి జిల్లా, ఎల్లుండి పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ తలపెడతామని హెచ్చరించింది. అంతేకాకుండా, ఎల్లుండి నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగుతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాగా, ముద్రగడ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయగోదావరి జిల్లాల్లో ధర్నాలు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు వద్ద కాపు సంఘం నేతలు ఆందోళనకు దిగారు.