: ఇకపై ప్రతీ నెలా 21వ తేదీన యోగా దినోత్సవం.. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
సంవత్సరానికి ఒకరోజు కాదు, ఇకపై మహారాష్ట్రలో ప్రతీ నెలా యోగా దినోత్సవం జరగనుంది. యోగావల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఫడ్నవిస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీని కోసం ప్రతీ నెల 21వ తేదీని యోగాడేగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈనెల జూన్ 21న అంతర్జాతీయ రెండో యోగా దినోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని పురస్కరించుకొని ముంబయిలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్ డే ఈరోజు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రతీ నెల 21వ తేదీన యోగాడే సందర్భంగా మహారాష్ట్రలోని అన్ని విద్యాసంస్థల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తాము ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వివేకానంద జన్మదినం సందర్భంగా 2017లో జనవరి 12 నుంచి పదిరోజుల పాటు యోగా మహోత్సవాన్ని కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.