: జోథ్ పూర్ ఏటీఎంలో హత్య... సీసీ టీవీలో రికార్డైన హత్యోదంతం!
రాజస్ధాన్ లోని జోథ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఏటీఎంలో దారుణమైన హత్య జరిగింది. ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు ఓ వ్యక్తి ప్రవేశించగా, ఆయనను అనుసరిస్తూ మరో వ్యక్తి వచ్చాడు. డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తి ఆ హడావుడిలో ఉండగా, ఆ రెండో వ్యక్తి వెనుక నుంచి కత్తితో దాడికి తెగబడ్డాడు. అతని కడుపులో వరుసగా పొడిచాడు. బాధితుడు తేరుకుని అతనిని అడ్డుకునే సరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. హంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేసిన బాధితుడు, కత్తిపోట్ల కారణంగా జరిగిన రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన మొత్తం ఏటీఎంలోని సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తం అయింది.