: సైంటిస్టు, ఇంజనీరు కావాలనుకుంటున్న అవిభక్త కవలలు... వీణా-వాణీల అంతరంగం!
అవిభక్త కవలలు వీణా-వాణీలను విడదీయడం సాధ్యం కాదని ఎయిమ్స్ వైద్యులు తాజాగా తేల్చేసిన విషయం తెలిసిందే. దీంతో, వారి కథ మళ్లీ మొదటికొచ్చింది. వీణా-వాణీలు గత పదమూడేళ్లుగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలోనే పెరుగుతున్నారు. వీరి ఆలనా పాలనా చూడడం కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించడంతో, వారికి వివిధ అంశాలను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంటూ అధ్యాపకుల సహాయంతో ఐదో తరగతి చదువుతున్న వీణా-వాణీలను కలిసిన ఒక ఛానెల్ కు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీణా మాట్లాడుతూ,‘నేను చాలా బాగున్నాను. చాలా బాగా టీచింగ్ జరుగుతోంది. నేను ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు చదువుకుంటున్నాను. ఆ సబ్జెక్టులను నేర్పిస్తున్నారు. చదువుకుంటాను, ఆడుకుంటాను, టీవీ చూస్తాను. చెస్, బాలుతో ఆడే గేమ్స్ ఆడతాను. నేను ఫ్యూచర్ లో సైంటిస్టు కావాలని కోరుకుంటున్నాను. మాలాంటి ట్విన్స్ పై రీసెర్చి చెయ్యాలని ఉంది’ అని చెప్పింది. అనంతరం వాణీ మాట్లాడుతూ,‘నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. ఉదయం లేవగానే యోగ, ఎక్సర్ సైజ్ వంటివి చేస్తాం. ఆ తర్వాత స్నానం, టిఫిన్ చేసుకున్న తర్వాత తొమ్మిది గంటలకు క్లాసు మొదలవుతుంది. నాలుగు గంటల వరకు జరుగుతాయి. ఆ తర్వాత రిలాక్స్ అయి.. గేమ్స్ ఏవైనా ఆడుకుంటాము. టీవీ చూసి.. హోం వర్క్ చేస్తాను.. తర్వాత డ్రాయింగ్స్ వేస్తాను. ఆ తర్వాత డిన్నర్ చేసి.. నిద్రపోతాను’ అని చెప్పుకొచ్చింది.