: మహ్మద్ అలీ శపపేటికను మోయనున్న హాలీవుడ్ నటుడు స్మిత్
‘ప్రపంచాన్ని నువ్వు ఒక ఊపు ఊపావు. మై మెంటర్, మై ఫ్రెండ్... నా జీవితాన్ని మార్చేసిన మిత్రుడా, నీ ఆత్మ శాంతించాలి’ అని బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీని ఉద్దేశించి 'రీల్' లైఫ్ అలీగా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. మహ్మద్ అలీతో కలిసి ఉన్న రెండు ఫొటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ అంత్యక్రియలకు విల్ స్మిత్ హాజరుకానున్నారు. అంతేకాదు, అలీ శవపేటికను స్మిత్ తన భుజాలపై మోయనున్నారు. మహ్మద్ అలీ జీవితం ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘అలీ’లో ప్రధానపాత్రను విల్ స్మిత్ పోషించడం, అద్భుత నటన ప్రదర్శించినందుకుగాను స్మిత్ ను ఆస్కార్ అవార్డు వరించడం తెలిసిందే. కాగా, గత శుక్రవారం మహ్మద్ అలీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా పార్కిన్ సన్స్ వ్యాధితో ఆయన బాధపడ్డారు. లూయిస్ విల్ లో రేపు అలీ అంత్యక్రియలను నిర్వహిస్తారు.