: భారత్ కు ఇచ్చారుగా!... మాకూ మద్దతివ్వాల్సిందే!: ఎన్ఎస్జీ సభ్యత్వంపై అమెరికాకు పాక్ అభ్యర్థన
అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తుకు అగ్రరాజ్యం అమెరికా సహా కూటమిలోని పలు దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న భేటీలో భారత్ సభ్యత్వంపై ఎన్ఎస్జీ కీలక నిర్ణయం వెలువరించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన ఆ దేశానికి ఎన్ఎస్జీలో సభ్యత్వానికి దారులు సుగమం చేసింది. ఈ పర్యటనను ఆసాంతం పరిశీలించిన పొరుగు దేశం పాకిస్థాన్... తనకూ ఎన్ఎస్జీలో సభ్యత్వం కావాలంటూ పట్టుబడుతోంది. భారత్ తో పాటు గత నెలలోనే తనకు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వాలని పాకిస్థాన్ దరఖాస్తు చేసుకుంది. భారత దరఖాస్తుకు సానుకూలంగా స్పందించిన అమెరికా పాక్ అప్లికేషన్ కు మాత్రం అంతగా మద్దతు తెలపలేదు. తాజాగా భారత్ కు మద్దతిస్తున్నట్లు అమెరికా బహిరంగ ప్రకటన చేయడంతో పాక్ కూడా తన స్వరం పెంచింది. ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం ఇస్తుండగా లేనిది తమకెందుకు ఇవ్వరంటూ అమెరికాకు పాక్ లేఖ రాసింది. ఈ మేరకు అమెరికాలో పాక్ రాయబారి జలీల్ అబ్బాస్ జిలానీ.. అమెరికా సెనేట్ లోని విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం తాము దరఖాస్తు చేశామని, మద్దతు కోసం రాసిన లేఖను మరోమారు పరిశీలించాలని ఆయన ఆ లేఖలో అమెరికాను కోరారు. మరి ఈ లేఖపై అమెరికా సెనేట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.