: 23 నుంచి టీఎస్ ఆర్టీసీ బస్సు చక్రాలు కదలవ్.. కార్మిక సంఘాల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మెకు సైరన్ మోగింది. ఈనెల 23నుంచి తమ బస్సు చక్రాలు కదలవని కార్మిక సంఘం నేతలు ఈరోజు ప్రకటన చేశారు. తాము ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచామని, వాటిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. తమ డిమాండ్లను నెరవేర్చని ప్రభుత్వ విధానాలకు నిరసనగా తాము సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు తాము తమ వేతన సవరణ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. డీఏ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాలని తాము ప్రభుత్వాన్ని కోరామని, అయితే తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ తో పాటు మరో నాలుగు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. తమ డిమాండ్లను ఈనెల 23 లోపు పరిష్కరించాలని లేదంటే ఆర్టీసీ బస్సుల చక్రాలు కదిలించమని పేర్కొన్నారు.