: ముద్రగడ దీక్షతో హుటాహుటిన బెజవాడకు చంద్రబాబు!... ఎయిర్ పోర్టులోనే పరిస్థితిని వివరించిన చినరాజప్ప
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో టీడీపీ అధినేత, నారా చంద్రబాబునాయుడు టెన్షన్ కు గురయ్యారు. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తో దీక్ష చేపట్టిన ముద్రగడ తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బలవంతంగా లోపలికి వస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆ సమయంలో కడపలో నిర్వహిస్తున్న మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపేసిన చంద్రబాబు ఉన్నపళంగా అక్కడి నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు టెన్షన్ లో ఉన్నారన్న సమాచారం అందుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడే కిర్లంపూడిలోని తాజా పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు.