: హెయిర్ సెలూన్ లో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్!... మెడికోను బలిగొన్న చెన్నై క్షౌరశాల


నిజమే... క్షవరం చేసేందుకు హెయిర్ సెలూన్ పేరిట వెలసిన ఓ క్షౌర శాలలో ఏకంగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అదేదో చిన్న పట్టణమో, వసతులు లేని మారుమూల ప్రాంతంలోనో కాదు. తమిళనాడు రాజధాని, సకల హంగులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న చెన్నై మహా నగరంలో. ఈ క్షౌర శాలలో ఇటీవల చేసిన ఓ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వికటించి ఓ వైద్య విద్యార్థి దుర్మరణం చెందాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... చెన్నైలో ‘అడ్వాన్స్ డ్ రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్’ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ సెంటర్ కు ప్రభుత్వ అనుమతి లేదు. హెయిర్ సెలూన్ పేరిట తీసుకున్న అనుమతి కాల పరిమితి కూడా ఇటీవలే ముగిసింది. అయినా సదరు సెంటర్ నిర్వాహకులు యథేచ్ఛగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కాస్తంత బట్ట తల వచ్చిన ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న మెడికో సంతోష్ ఇటీవలే సదరు సెంటర్ కు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వెళ్లాడు. దాదాపు 10 గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన సదరు సెంటర్ నిర్వాహకులు సంతోష్ కుమార్ తలపై 1,200 రోమాలను అమర్చారు. ఇందుకోసం సంతోష్ దాదాపు రూ.73 వేలు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన సంతోష్ కు జ్వరం వచ్చింది. అయితే మామూలు జ్వరమే కదా అన్న భావనతో అతడి తల్లిదండ్రులు ఉండగా, పడుకున్న మంచంలోనే సంతోష్ తుది శ్వాస విడిచాడు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మరణించాడని సంతోష్ తల్లి జోస్ బెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెంటర్ ను సీజ్ చేసి కేసుపై దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News