: తొమ్మిదేళ్ల వయసులోనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన చిన్నారి
ఆ చిన్నారి వయసు తొమ్మిదేళ్లు మాత్రమే. అయినా తన చిట్టి చేతులతో ఎంతో మందికి సాయం చేస్తోంది. తన స్థాయికి మించి పేదలకు సాయం చేస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకుంటోంది. చిన్న వయసులో ఎంతో మంది పెద్దలకి స్ఫూర్తిగా నిలుస్తోంది. నిరుపేద మహిళలకు కనీస అవసరాలను తీరుస్తూ చిన్ని వయసులోనే తన పనులతో ఆదర్శాన్ని చాటుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కోలే థామ్సన్ తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదవారిని చూసి చలించి పోయింది. వారు పడుతోన్న కష్టాలను కళ్లారా చూసిన ఈ బాలికకి తన మనసులో వారికి ఎలాగైనా సాయం అందిచాలన్న మంచి ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా తన చేతులతో కుట్టిన బ్యాగులను నిరుపేద మహిళలకు అందించాలనే సంకల్పాన్ని తీసుకుంది. పేదలకు అవసరమైన నిత్యావసర వస్తువులైన టూత్ పేస్ట్, సబ్బులు, దుస్తులు వంటి వస్తువులను తన చేతితో తయారు చేసిన బ్యాగులలో ఉంచి పంచి పెడుతోంది. చిన్నారికి తన తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. దీంతో తన సాయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ చిన్నపాటి స్వచ్ఛంద సంస్థనే నడిపిస్తోంది.