: సచిన్ రికార్డును మరోసారి బ్రేక్ చేయగలను: అలిస్టర్ కుక్
టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ 31 ఏళ్ల 10 నెలల వయసులో 10వేల పరుగులు పూర్తి చేస్తే, ఆ రికార్డును తిరగరాస్తూ ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ 31 ఏళ్ల 5 నెలల వయసులోనే ఇటీవల ఆ ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్టుల్లో పదివేల పరుగులు సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ పై ప్రపంచ క్రికెటర్లు అందరూ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్ కూడా కుక్‌ను అభినందిస్తూ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును అధిగమిస్తాడని పొగిడేశారు. ఈ అంశంపై కుక్ తాజాగా స్పందిస్తూ.. తాను టెస్టుల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును సమం చేయగలను అన్నాడు. అయితే తాను సచిన్ టెండూల్కర్ అంతటి గొప్పవాడిని కాదని పేర్కొన్నాడు. సచిన్ తన కంటే ఎంతో గొప్ప క్రికెటర్ అని కుక్ అన్నాడు. సచిన్ పేరిట ఉన్న 15,921 పరుగుల రికార్డును బ్రేక్ చేయాలంటే తాను ఇంకా చాలా కాలం పాటు జట్టులో నిలదొక్కుకొని ఆడాల్సి ఉంటుందన్నాడు. రికార్డులు కొంత మందికి మాత్రమే సొంతమవుతాయని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 10,042 పరుగులు సాధించిన తాను సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా చాలా పరుగులు చేయాల్సి ఉందని కుక్ పేర్కొన్నాడు. తన జట్టు విజయాలు సాధించే అంశంపైనే తన దృష్టి ఉందని ఆయన పేర్కొన్నాడు.