: సెల్ఫీని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి పోలీసుల చేతికి చిక్కిన హంతకుడు
సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటోన్న ఘటనలు వింటూనే ఉన్నాం. అయితే సెల్ఫీలు హంతకులను కూడా పట్టిస్తున్నాయి. ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతోన్న ఓ హంతకుడు సరదాగా తీసుకున్న సెల్ఫీని తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి దొరికిపోయాడు. చెన్నైలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తోన్న మణి అనే వ్యక్తి 2009లో తన సొంత ఊరయిన చెన్నై అరియళూరుకి వచ్చాడు. ఆయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. 2009లో తన భార్య విజయలక్ష్మి తో గొడవ పెట్టుకుని కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి, చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత పోలీసులు అతని గురించి ఎంతగా గాలించినా లాభం లేకపోయింది. తాజాగా ఆ హంతకుడు తన స్నేహితులతో కలసి దిగిన ఓ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను మరణించిన అతని భార్య విజయలక్ష్మి బంధువులు గమనించారు. ఈ విషయాలన్నీ పోలీసులకి తెలిపారు. ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ద్వారా హంతకుడిని గాలించిన పోలీసులకు ఎట్టకేలకు అతను చిక్కాడు. హంతకుడు మణి తన భార్యను హత్యచేసిన తరువాత నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో గడిపాడని, తరువాత మళ్లీ చెన్నైకి వెళ్లి అక్కడి ఓ హోటల్‌లో ఉద్యోగం చేశాడని పోలీసులు మీడియాకి తెలిపారు.