: భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం ఖాయమే!... మద్దతు తెలిపిన మెక్సికో అధ్యక్షుడు
అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న భారత్ కు మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా భారత ఎన్ఎస్జీ సభ్యత్వానికి పూర్తిగా మద్దతు తెలపగా, తాజాగా ఆ కూటమిలోని మరో కీలక దేశం మెక్సికో కూడా తన మద్దతును ప్రకటించింది. ఈ మేరకు నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో బహిరంగ ప్రకటన చేశారు. ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తుకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని మోదీ ఇప్పటికే పలు దేశాల మద్దతును కూడగట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని దేశాల మద్దతు లభించడంతో ఇక ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.