: దీక్షకు ముందే ముద్రగడను అరెస్ట్ చేస్తామంటున్న ఖాకీలు!... ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామంటున్న కాపులు!
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మరింత మేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను విడుదల చేయడంతో పాటు కేసులన్నీ ఎత్తివేయాలని కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో తన డిమాండ్ల సాధనకు ఆయన మరికాసేపట్లో తన సొంతింటిలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసులను కిర్లంపూడిలో మోహరించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దీక్షకు ముందే ముద్రగడను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు వారు ముద్రగడ ఇంటిలోపలికి వెళ్లేందుకు యత్నించగా అప్పటికే అక్కడకు చేరుకున్న వందలాది మంది కాపులు వారిని అడ్డుకున్నారు. ఏ ఒక్క కేసు లేని ముద్రగడను ఎందుకు అరెస్ట్ చేస్తారని కాపులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా తుని విధ్వంసానికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పి, తనను అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్ కు వచ్చిన ముద్రగడను మొన్న ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. దీంతో ఓ అడుగు వెనక్కేసిన పోలీసులు... ముద్రగడ ఇంటి గేటుకు అడ్డుగోడగా నిలుచున్న కాపులను అక్కడి నుంచి తప్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ మరింత మేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.