: మహా సంకల్ప సభలో జనం మధ్య నారా లోకేశ్!... జగన్ పై సెటైర్లేసిన వర్ల!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిన్న జరిగిన మహా సంకల్ప సభలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య విపక్ష నేతపై సెటైర్లు సంధించారు. సభా వేదిక వద్దకు సీఎం నారా చంద్రబాబునాయుడు కంటే పది నిమిషాలకు ముందుగానే వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వేదికను ఎక్కకుండా జనం మధ్యే కూర్చుండిపోయారు. నారా లోకేశ్ సింప్లిసిటీని ప్రస్తావించిన వర్ల రామయ్య... గతంలో వైఎస్ సీఎంగా ఉండగా కడపలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావించారు. తండ్రి అధికారాన్ని ఆసరా చేసుకుని వేదిక ఎక్కిన వైఎస్ జగన్... సీఎం హోదాలోని తన తండ్రి పక్కన ఐఏఎస్ అధికారికి కేటాయించిన సీట్లో కూర్చున్న వైనాన్ని ప్రస్తావించారు. మహా సంకల్ప సభకు వచ్చిన నారా లోకేశ్... తన తండ్రి సీఎం హోదాలో ఉన్నా, వేదిక ఎక్కకుండా జనం మధ్యే కూర్చుండిపోయారని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టే ఎవరి నైజం ఏమిటో ఊహించవచ్చని వర్ల వ్యాఖ్యానించారు.