: కిర్లంపూడిలో హైటెన్షన్!... కాసేపట్లో ముద్రగడ దీక్ష, భారీగా పోలీసుల మోహరింపు


తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తుని విధ్వంసకారులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయడంతో పాటు వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. అయితే ముద్రగడ డిమాండ్ ను ప్రభుత్వం తోసిపుచ్చింది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విడుదల చేయడం కుదరదని, ముద్రగడ డిమాండ్లు సరికాదని నిన్న ఏపీ మంత్రులు తేల్చిచెప్పారు. దీంతో నేటి ఉదయం 9 గంటల నుంచి ముద్రగడ దీక్షకు దిగేందుకు సిద్ధమయ్యారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కాపు నేతలు, యువకులు కిర్లంపూడికి వచ్చే అవకాశాలున్నాయని భావించిన పోలీసులు కిర్లంపూడికి వచ్చే దారులన్నిటినీ మూసేశారు. గ్రామానికి చెందిన వారిని మినహా ఏ ఒక్కరిని కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు. కిర్లంపూడికి దారి తీసే రోడ్లపై ఔట్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కాని పంపడం లేదు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల కింద తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చారు. వెరసి ముద్రగడ దీక్ష నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News