: రేపటి నుంచి దీక్షకు సిద్ధం... అరెస్ట్ చేస్తే జైల్లోనే దీక్ష కొనసాగిస్తా!: ముద్రగడ స్పష్టీకరణ


తుని ఘటనలో అరెస్టయిన వారి విడుదల విషయమై ఏపీ సర్కార్ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో రేపటి నుంచి నిరవధిక దీక్ష చేసేందుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఒక ఛానెల్ తో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ, ‘రేపు ఉదయం తొమ్మిది గంటలకు నేను ఒక్కడినే దీక్షకు దిగుతున్నాను. రౌడీషీటరైనా, దోపిడీదారుడైనా, ఖూనీ కోరైనా.. ఆ కేసులు సెపరేటు. మా జాతి సమావేశానికి వచ్చి అరెస్టయిన వారిని రక్షించడం మా బాధ్యత. నన్ను అరెస్టు చేయమనే నిన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. మంత్రులు నన్ను అరెస్టు చేస్తామనడమేంటి, పిచ్చోళ్లు! నన్ను అరెస్టు చేస్తే జైల్లోనే దీక్ష చేస్తాను.. మరీ హ్యాపీ. నేను జైల్లో ఉంటే కాపు ఉద్యమాన్ని నడిపేదెవరనే విషయాన్ని మా నాయకులు చూసుకుంటారు’ అని అన్నారు. తన దీక్ష వద్దకు వివిధ గ్రామాల నుంచి వచ్చే జనాన్ని ఆపుతారని తెలుసని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెడతారని తెలుసని, తనను ఒంటరిని చేయాలని, మీడియా కవరేజ్ లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందనీ తనకు తెలుసని ముద్రగడ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News