: ఒక ముఖ్యమంత్రిని చీపురుకట్టతో కొట్టమని మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుందో ఆలోచించండి!: సీఎం చంద్రబాబు


ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చీపురుకట్టతో కొట్టమంటూ కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ మాటలు ఎంత బాధకల్గిస్తాయనే విషయాన్ని ఆలోచించమని కడప ప్రజానీకాన్ని కోరుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కడపలో జరుగుతున్న మహా సంకల్స దీక్షలో ఆయన మాట్లాడుతూ, ‘కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నాను. టెక్నాలజీ ఉపయోగించి ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తుంటే... ఈ విధంగా నాపై మాట్లాడటం న్యాయమా? ఎంత బాధాకరమో మీరే ఆలోచించాలి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని చెప్పుతో కొడతామంటే, మీకు ఎంత ఆవేశం, ఎంత బాధేస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి. కడప జిల్లాకు ఏమి అన్యాయం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి అన్యాయం జరిగింది? ఈ జిల్లాకు చెడ్డ పేరు మీ వల్లే వచ్చింది. ఈ జిల్లాను, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. బాగా దెబ్బతిన్న జిల్లాను మళ్లీ అభివృద్ధి చేయడానికి, చెడ్డపేరు పోగొట్టడానికి నేను శతవిధాల పనిచేస్తుంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేరాలు చేసే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఇన్ని కష్టాలుంటే, నేనేదో నరేంద్ర మోదీ గారికి రాజీ అయిపోయానని, ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడుతున్నానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం నాకేదో ఇష్టం లేదని, నేనిచ్చిన హామీలు నిలబెట్టడం లేదని మాట్లాడుతున్నాడు. నేనిచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టాను. అదే, రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేరలేదు.. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News