: స్వామి వారి లగ్జరీ బస్సుకు రూ.11 లక్షల రోడ్డు పన్ను మినహాయింపు
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి లగ్జరీ బస్సుపై లక్షలాది రూపాయల రోడ్డు పన్నును మధ్యప్రదేశ్ ప్రభుత్వం మినహాయించింది. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి లగ్జరీ బస్సుకు సుమారు రూ.11 లక్షల రోడ్డు పన్నును మినహాయింపు ఇచ్చామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ లగ్జరీ బస్సు వాస్తవ ఖరీదు రూ.15 లక్షలు. అయితే, ఇందులో వాష్ రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర వసతులు ఏర్పాటు చేశారు. దీంతో, ఈ ఖర్చులు కూడా కలుపుకుని మొత్తం ఖరీదు రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ బస్సును గత ఏడాది కొనుగోలు చేశారు. ఈ బస్సుపై పన్నును రద్దు చేయాలని రోడ్లు, భవనాల శాఖను స్వామి వారి శిష్యులు కోరారు. సదరు శాఖ అందుకు నిరాకరించడంతో, హోం శాఖ మంత్రి బాబులాల్ గౌర్ ను వారు కలవడంతో పని చక్కబడింది. ఇటీవల ఉజ్జయినిలో సింహస్త కుంభమేళా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కుంభమేళా నిర్వహణకు గాను శంకరాచార్య పీఠం నుంచి సాయం కావాలని రవాణా శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ కోరడం, అందుకు ఆ పీఠం సహకరించడం జరిగింది. ఇందుకు ప్రతిఫలంగానే స్వామి వారి బస్సుకు రోడ్డు పన్నును రద్దు చేసినట్లు సమాచారం.