: మోదీ కోణార్క్ కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు


ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో కోణార్క్ దేవాలయంపై చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ, భారత చరిత్ర చాలా గొప్పదని అన్నారు. మినీ స్కర్ట్ ధరించి, పర్సు పట్టుకున్న ఆధునిక యువతిని పోలిన కళాఖండాలను రెండువేల ఏండ్ల క్రితమే కోణార్క్ దేవాలయంపై శిల్పులు చెక్కారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మోదీపై నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. మోదీకి చరిత్రపై అవగాహన లేనప్పుడు దాని గురించి అవాకులు చవాకులు మాట్లాడడం అవసరమా? అని పేర్కొంటున్నారు. కోణార్క్ దేవాలయాన్ని రెండు వేల ఏండ్ల క్రితం కట్టలేదని, అది 13వ శతాబ్దంలోనిదని, అంటే 1250 ప్రాంతంలో కట్టిన దేవాలయమని, దానిని నిర్మించి కేవలం 766 సంవత్సరాలు మాత్రమే అయిందని వారు చరిత్రను గుర్తు చేస్తున్నారు. ఇకపోతే కోణార్క్ దేవాలయంపై బొమ్మలన్నీ నగ్న లైంగిక దృశ్యాలే ఉంటాయి. అక్కడక్కడ కొందరు మహిళల నడుముకు ఆచ్ఛాదనగా నగలు ఉంటాయి. మోదీ చెప్పినట్టు మినీ స్కర్టులు ధరించి, పర్సులు పట్టుకున్న మహిళలు కనిపించరు. దీంతో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంతైనా మోదీ చరిత్రను తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News