: న్యాయవాదులు న్యాయం కోసం ఆందోళన చేయడం విచిత్రమే..!: కోదండరాం
హైకోర్టు విభజనపై న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని, న్యాయవాదులు న్యాయం కోసం పోరాడడం విచిత్రమని ప్రొ.కోదండరాం అశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము న్యాయవాదుల ఆందోళనకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తామిచ్చిన మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ జేఏసీ సమావేశంలో చాలా సూచనలొచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణలో కొనసాగుతోన్న భూసేకరణ విధానం సరికాదని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం సదస్సు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. వర్సిటీల సమస్యల పరిష్కారం కోసం ఓయూ వేదికగా ఓ సదస్సు జరుపుతామన్నారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలపై ఆయన స్పందించలేదు. తాను నలుగురికీ చెప్పే వాడిని కానీ చెప్పించుకునే వాడిని కాదని కోదండరాం వ్యాఖ్యానించారు.