: సోనియా గాంధీపై కేరళలో కేసు నమోదు!... కాంట్రాక్టరుకు బిల్లులివ్వకపోవడమే కారణం!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఇప్పటికే తన జీవితంలోనే తొలిసారి కోర్టు మెట్లెక్కారు. మొన్నటికి మొన్న ఆమె పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టాల్సి వచ్చింది. తాజాగా ఆమెపై ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... తిరువనంతపురంలో రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ స్టడీస్ (ఆర్జీఐడీఎస్) పేరిట ఏర్పాటైన సంస్థకు సంబంధించిన భవన నిర్మాణాన్ని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ఆ రాష్ట్రానికి చెందిన ‘హీథర్ కన్ స్ట్రక్షన్’ కంపెనీకి కట్టబెట్టింది. పనులు చేసిన సదరు సంస్థకు కేపీసీసీ బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ విజయ్ నేటి ఉదయం తిరువనంతపురం పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు సోనియా గాంధీతో పాటు ఆర్జీఐడీఎస్ చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ, కేపీసీసీ అధ్యక్షుడు సుధీరన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.