: రాజ్యసభ ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న విజయసాయిరెడ్డి!... ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని వెల్లడి!
ఇటీవలే ఏపీ కోటాలోని నాలుగు సీట్లకు ముగిసిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున మొన్న ఆయన తన ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకోలేకపోయారు. తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని అసెంబ్లీకి చేరుకున్న ఆయన అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ నుంచి రాజ్యసభ ఎన్నిక గెలుపునకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి... తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సభలో పోరాడతానని ఆయన వెల్లడించారు.