: పవన్ కల్యాణ్ మౌనం వీడు!... ప్రధానితో మాట్లాడు!: జనసేన అధినేతకు వీహెచ్ పిలుపు!
కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న కాపు ఐక్యవేదిక, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతుగా నిలిచారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాపుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనని ఆయన పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేని పక్షంలో కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా వీహెచ్... జన సేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. కాపులకు న్యాయం చేసేందుకు పవన్ కల్యాణ్ చర్యలు చేపట్టాలన్నారు. పవన్ కల్యాణ్ తన మౌనం వీడి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలన్నారు. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏపీ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని కూడా వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల ఉద్యమాన్ని కేసులతో అణచివేయాలని చూస్తే సహించబోమని కూడా వీహెచ్ హెచ్చరికలు జారీ చేశారు.