: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు స్పష్టత... జిల్లాల సంఖ్య 30కి పెంచాలని కలెక్టర్ల సూచనలు
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కేసీఆర్ ఆదేశాలతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్‌పీటర్ అధ్యక్షతన నిన్న జరిగిన సమావేశంలో జిల్లాల కలెక్టర్లు పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారుల నుంచి రేమండ్‌పీటర్ వివరాలు, సూచనలు సేకరించారు. ఇదే అంశంపై నేడు కూడా చర్చించి అనంతరం మధ్యాహ్నం తమ నివేదికను సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. నిన్న ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా కలెక్టర్లతో చర్చలు జరిపిన రేమండ్‌పీటర్‌కు అధికారుల నుంచి తెలంగాణలో జిల్లాల సంఖ్యను 30వరకు పెంచవచ్చనే సూచన వచ్చింది. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని ప్రాంతాల్లో కొత్త జిల్లాల ప్రతిపాదన, డివిజన్లపై నివేదిక, మ్యాప్‌లను సమర్పించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జిల్లాల సంఖ్యను పెంచే అవసరాలపై కలెక్టర్లు వివరణనిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువయ్యే అంశాలను పరిశీలించారు. తెలంగాణ సర్కార్ తెలంగాణలో మొత్తం 25వరకు జిల్లాలు ఉండాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కలెక్టర్లు తెలంగాణలో జిల్లాల సంఖ్య 30 ఉంటే పాలన మరింత సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో కొత్త జిల్లాగా జగిత్యాలతో పాటు సిరిసిల్లను కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆ జిల్లా కలెక్టరు సూచించినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్‌లో కొత్త జిల్లాలుగా ప్రతిపాదిస్తోన్న వనపర్తి, నాగర్‌కర్నూలుతో పాటు మరో కొత్త జిల్లాను అధికారులు ప్రతిపాదించారు. గద్వాల, నారాయణపేటల్లో ఏదైనా ఒక ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పినట్లు సమాచారం. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ముందుగా రెండేసి జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రెండేసి జిల్లాలతో పాటు మరో కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్లు సూచించినట్లు సమాచారం. మిగిలిన నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. నేడు అధికారులు మరోసారి చర్చించిన తరువాత తెలంగాణలో కొత్త జిల్లాల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.