: ఆ రెండు వ్యాఖ్యలే... కోదండరాంపై టీఆర్ఎస్ మాటల దాడికి కారణమట!


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటూ ఉవ్వెత్తున ఎగసిపడ్డ మలిదశ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అప్పటిదాకా ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు బతికించుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక భూమిక పోషించారు. ఉద్యమ సమయంలో వారిద్దరూ అడుగులో అడుగేసి నడిచారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో వారు సఫలీకృతులయ్యారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా కోదండరాం జేఏసీలోనే ఉండిపోయారు. రెండేళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు మొన్న మూకుమ్మడిగా కోదండరాంపై మాటల దాడి చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. రెండేళ్ల పాలనలో ఏం సాధించారని కోదండరాం ప్రశ్నించిన మీదటే టీఆర్ఎస్ ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల క్రితం కోదండరాం చేసిన రెండు వ్యాఖ్యలే టీఆర్ఎస్ నేతలను ఆగ్రహావేశాలకు గురి చేశాయన్న వాదన వినిపిస్తోంది. ‘రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం’, ‘చేతకాకుంటే కేసీఆర్ పదవి నుంచి దిగిపోవాలి’... కోదండరాం నోటి నుంచి బాణాల్లా దూసుకువచ్చిన ఈ రెండు వ్యాఖ్యలే టీఆర్ఎస్ లో ఆగ్రహాన్ని రగిల్చాయన్నది విశ్లేషకుల వాదన. అయితే ఈ వ్యాఖ్యలను తాను చేసినట్లు వస్తున్న వార్తలపై కోదండరాం నేటి ఉదయం ఓ తెలుగు ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఖండించలేదు. అలాగని సదరు మాటలు తన నోటి నుంచి వచ్చాయని కూడా ఆయన చెప్పలేదు. తాను చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డై ఉన్నాయని, ఆ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అవసరమనుకుంటే సదరు వీడియోలను పరిశీలించి తన వ్యాఖ్యలను తెలుసుకోవచ్చని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News