: ముద్రగడనూ క్రిమినల్ గా పరిగణిస్తాం!: గంటా సంచలన వ్యాఖ్య
కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆయన సామాజిక వర్గానికే చెందిన ఏపీ మానవవనరుల శాఖ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తునిలో విధ్వంసానికి దిగి క్రిమినల్స్ గా పోలీసు రికార్డులకెక్కిన వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడను కూడా క్రిమినల్ గా భావించాల్సి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం కడపలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా... అరెస్ట్ చేసిన కాపు యువకులపై కేసులు ఎత్తివేయాలన్న ముద్రగడ డిమాండ్ పై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన నిందితులంతా అమాయకులైతే... మరి విధ్వంసానికి పాల్పడ్డ వారు ఎవరో ముద్రగడే వెల్లడించాలని కూడా గంటా డిమాండ్ చేశారు. ముద్రగడ వల్ల కాపు జాతికి తీరని నష్టం జరుగుతోందని కూడా గంటా ఆవేదన వ్యక్తం చేశారు.