: నారాయణపేట కోర్టుకు హాజరైన మావోయిస్టు కోబడ్ గాంధీ
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డితో పాటు పది మంది మృతి చెందిన కేసుకు సంబంధించి మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు కోబడ్ గాంధీని ఢిల్లీ పోలీసులు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డిని హతమార్చిన కేసులో వ్యూహకర్తగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోబడ్ గాంధీ తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ విషయమై ప్రత్యేక విమానంలో ఆయన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 21 వ తేదీకి కేసును వాయిదా వేశారు. అనంతరం, ఆయనను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. ఆయనపై ఉన్న కేసును జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా, 2005 ఆగస్టులో ఎమ్మెల్యే నర్సిరెడ్డిని, ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డితోపాటు మరో 8 మందిని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ విషయమై 2010 ఏప్రిల్ 27న కోబడ్ గాంధీని మొదటిసారి కోర్టుకు హాజరు పరిచారు. అప్పటి నుంచి పీటీ వారెంట్ ఉన్న కారణంగా ఇంతవరకు ఆయన కోర్టుకు హాజరు కాలేదు. అయితే, ఈరోజు కోర్టుకు హాజరుపర్చాల్సి ఉండటంతో ఆయనను ప్రత్యేకంగా తీసుకువచ్చారు.