: రేపు సాయంత్రమే ఆఖరు... ప్రాణత్యాగానికి సిద్ధం... ఆమరణ నిరాహార దీక్ష చేపడతాను: ముద్రగడ అల్టిమేటం
రేపు సాయంత్రంలోగా కాపులు ఎవరిపైనా కేసులు లేవని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరిలో కాపు గర్జన పేరుతో తాను నిర్వహించిన సభకు అంతా వచ్చారని, వారందర్నీ రక్షించుకోవాల్సిన పూచీ తనపై ఉందని అన్నారు. ఆ సందర్భంగా తాను చేపట్టిన దీక్ష సమయంలో ప్రభుత్వ ప్రతినిధులు తనతో సంప్రదింపులు జరుపుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల బీసీల్లో పలు అనుమానాలు ఉన్నాయని, వారి నుంచి వ్యతిరేకత లేకుండా చూస్తామని, అందుకు కొద్ది సమయం పడుతుందని, అంతవరకు ఆగాలని హామీ ఇచ్చారన్నారు. అలాగే అప్పట్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఎవరిపైనా కేసులుండవని వారు తనకు మాట ఇచ్చారని ఆయన తెలిపారు. వాటన్నింటిని మర్చిపోయిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కేసులు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రికి చెక్కభజన చేస్తున్న వారితో తనను తిట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుని ఘటన పేరుతో కాపు జాతి యువకులతో పాటు ఇతర యువకులను కూడా వేధించడం బాధగా ఉందని ఆయన చెప్పారు. బీసీల్లో కలపాలంటే కమిషన్ రిపోర్ట్ కావాలని, అందుకని అప్పట్లో తనను ఒక మెట్టు దిగమన్నారని ఆయన తెలిపారు. వారి మాటలు విశ్వసించి ఇంతకాలం ఆగానని ఆయన చెప్పారు. కేసుల పేరుతో వేధింపులకు దిగుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన చెప్పారు. కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే, ఇన్ని నెలలు ముగుస్తున్నా కమిషన్ ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కాపు జాతి సోదరులను వరుసగా జైళ్లలో పెట్టే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. తనను విశ్వసించే కాపు సోదరుల నుంచి, తనను విడదీయడం కోసమే తనకు ఈ కేసులతో సంబంధం లేదని అంటున్నారని ఆయన తెలిపారు. అప్పుడు వేధించడం కుదరలేదని, ఇప్పుడు తన జాతి సోదరులను అరెస్టు చేస్తూ, తనపై కేసులు లేవంటున్నారని ఆయన మండిపడ్డారు. ఐక్యంగా ఉన్న తమ మధ్య చిచ్చుపెట్టి కాపుల్లోని నాలుగు ఉపకులాలను విడదీయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తనతో పాటు ఎంతో మందిని దగా చేస్తుంటే...ఎక్కడ లేని కోపం వస్తోందని ఆయన చెప్పారు. చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? తరువాత వెనక్కి తగ్గడం ఎందుకని? ఆయన ప్రశ్నించారు. నిత్యం మీకు పాలికాపు పనులు చేయడమే మా జాతి లక్ష్యమా? అని ఆయన నిలదీశారు. ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పిన ఆయన, నిరాహార దీక్ష ద్వారా ప్రాణ త్యాగానికి సిద్ధమవుతున్నానని అన్నారు. ఇక ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేనని...కాపు జాతి, ఇతర జాతులను రక్షించుకునేందుకు ఆత్మత్యాగానికి సిద్ధమవుతున్నానని ఆయన పేర్కొన్నారు. రేపు సాయంత్రంలోపు కాపులపై ఎలాంటి కేసులు లేవని అధికారిక ప్రకటన విడుదల కావాలని, లేని పక్షంలో 9వ తేదీ ఉదయం 9 గంటలకు తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకున్నా... తాను మాత్రం బాధ్యతను విస్మరించనని ఆయన చెప్పాను. జాతిని ఇబ్బందుల పాలు చేసి ఇంట్లో నిద్రపోయే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని, తన ప్రాణత్యాగాన్ని సీఎం కోరుకుంటే దానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.